మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
కాగజ్‌నగర్‌టౌన్: వేతనాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో కాగజ్‌నగర్ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు 18 రోజులుగా చేస్తున్న సమ్మెను శుక్రవారం రాత్రి విరమించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ దండె విఠల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. సోమవారం వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వేతనాలను మంజూరు చేశారని తెలిపారు. కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమయ్యాయని, సోమవారం కార్మికుల ఖాతాలోకి జమ చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాగజ్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇటీవలే నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎంతో వెనుకబడిందని, కార్మికులు వేతనాల నుంచి కోత విధిస్తున్నా పీఎఫ్ డబ్బులను కూడా వారి ఖాతాల్లో జమ చేయడం లేదని పేర్కొన్నారు. కార్మికుల వేతనాల కోసం ప్రస్తుతం రూ.2 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారని తెలిపారు. అలాగే పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే పారిశుద్ధ్య పనుల్లోకి పంపించాలని అధికారులను ఆదేశించారు. బకాయి పన్నులను వార్డు ఆఫీసర్లు వసూలు చేయకపోవడంతోనే ఈ సమస్య దాపురించిందని, పెద్ద కంపెనీల నుంచి బకాయిలను వసూలు చేయాలని సూచించారు. దుబారా ఖర్చులు పెరిగాయేగానీ, ఆదాయం పెరగడం లేదన్నారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రెండేళ్ల క్రితం వినాయక నిమజ్జనంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న కార్మికుడు మృతి చెందగా, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించలేదని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ మధుకర్, సీఐటీయూ నాయకులు త్రివేణి, కూశన రాజన్న, ముంజం శ్రీనివాస్, ఆనంద్‌కుమార్, రాజేందర్, శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


