ఆకాంక్షిత బ్లాక్‌లో వసతుల కల్పనకు కృషి
ఆసిఫాబాద్: ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో వసతుల కల్పనకు కృషి చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారి రజత్‌కుమార్ సైని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్, జిల్లా కార్యక్రమంలో నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న వసతులపై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ ద్వారా తిర్యాణి బ్లాక్, జిల్లా స్థాయి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ మారుమూల గ్రామంలో ఇంటర్నెట్, రహదారులు, గిరిజనులకు పక్కా ఇళ్లు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు నీతి ఆయోగ్ నిధుల ద్వారా చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర ప్రభారికి అధికారులు వివరించారు.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి
తిర్యాణి: అభివృద్ధే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారి రజత్ కుమార్ సైని అన్నారు. మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి పరిశీలించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని కార్యాలయాల్లో 50 కంప్యూటర్లు, 30 ప్రింటర్లు, ఐదు ప్రొజెక్టర్లు, 40 టీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గుడిపేటలో మోడల్ అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణం, జెండాగూడలో పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


