ఎస్పీఎం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపరు మిల్లు(ఎస్పీఎం) గుర్తింపు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. డీసీఎల్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ యాజమాన్యం హైకోర్టు పరిధిలోని లేబర్ కోర్టును ఆశ్రయించగా, శుక్రవారం ఆ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. గతేడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు. అక్టోబర్ 27న కార్మిక సంఘాలు, మిల్లు ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం సైతం నిర్వహించారు. అయితే యాజ మాన్యం సమావేశానికి గైర్హజరై కోర్టును ఆశ్రయించింది. పలు కార్మిక సంఘాల నాయకులు రిట్ పిటిషన్‌ను దాఖలు చేసి న్యాయవాదులతో వాదనలు వినిపించారు. కోర్టు ఈ కేసును రిజర్వులో ఉంచి.. శుక్రవారం యాజమాన్యం వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.
నాయకుల సంబురాలు
కోర్టులో సానుకూలంగా తీర్పు రావడంతో కార్మిక సంఘం నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు మాట్లాడుతూ కార్మికుల తరఫున బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ న్యాయవాది లక్ష్మీనారాయణ ద్వారా బలమైన చర్యలు చేపట్టారన్నారు. ఎన్నికల ప్రక్రియను కార్మిక శాఖ అధికారుల ద్వారానే నిర్వహించాలనే లక్ష్యంతో పూర్తి సహకారం అందించారన్నారు. అనంతరం స్థానికంగా టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్, మనోహర్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.


