సీఎం కప్ పోటీల్లో సత్తా చాటాలి
ఆసిఫాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరిగే సీఎం క్రీడా కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం యువజన క్రీడా సేవల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడల టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్‌తో కలిసి టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు నిర్వహించి, విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కలెక్టరేట్ నుంచి కుమురంభీం చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సంచాలకుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


