అమ్మబోతే అడవి..
నిల్వ చేస్తే కొరివి
ఇక్కడ పత్తి నిల్వను చూపుతున్న రైతు పేరు రాంటెంకి రవి. దహెగాం మండలంలోని కోత్మీర్ గ్రామానికి చెందిన ఈయన వర్షాకాలంలో 14 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇప్పటివరకు 30 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకున్నాడు. ధర క్వింటాలుకు రూ.వంద తగ్గడంతో అమ్మకుండా ఇంటి వద్దే ఉంచాడు. కాలం కలిసి రాక పత్తి దిగుబడి తగ్గిందని, దానికి తోడు మద్దతు ధర లేకపోవడంతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇంటి ఆవరణలో నిల్వ చేసిన పత్తిని చూపిస్తున్న ఈ రైతు కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి గ్రామానికి చెందిన మెంథ్యాల రాజేశ్. ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాలేదు. ఇప్పటివరకు తీసిన సుమారు 70 క్వింటాళ్ల పత్తిని అమ్మకుండా ఇంటి ఆవరణలో కవరు కప్పి ఉంచాడు. ధర నిలకడగా లేకపోవడంతో నష్టపోతామని చెబుతున్నారు. వీరే కాదు.. జిల్లాలో అనేక మంది అన్నదాతలు పత్తి సాగు చేస్తున్న రైతులు పంటను అమ్ముకోకుండా ఇళ్లలో నిల్వ చేసుకున్నారు.
దహెగాం: పత్తి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆశించిన ధర వస్తుందని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంది. ఓ వైపు సీసీఐ క్రమంగా మద్దతు ధరలో కోత పెడుతుండగా, ప్రైవేట్ వ్యాపారులు, దళారులు కూడా అన్నదాతలను దోపిడీకి గురిచేస్తున్నారు. పత్తితీత పనులు నెల రోజుల నుంచి ముమ్మరం కాగా ధర మాత్రం తగ్గింది.
తగ్గిన దిగుబడి
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. యూరియా కొరత, అధిక వర్షాలతో మొక్కల్లో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదు. భారీ వర్షాల ప్రభావం పూత, కాతపై పడింది. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 7 నుంచి 8 క్వింటాళ్లు వచ్చింది. సీజన్ ఆరంభంలో వర్షాలు సమృద్ధిగా పడలేదు. జూలైలో వర్షాలకు మొలకలు వచ్చాయి. పంట ఆశాజనకంగా ఉండగా పూత, కాత దశలో భారీ వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చాయి. ఆగస్టులో పెద్దవాగు, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు భారీగా కొట్టుకుపోయాయి.
మద్దతు ధరలో కోత
ఈ ఏడాది కాగజ్‌నగర్, రెబ్బెన మండలం కొండపల్లి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్(టి), కౌటాల, జైనూర్‌లో మొత్తం 18 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతున్నారు. కేవలం నాలుగు నుంచి ఐదు జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే ప్రైవేటు కొనుగోళ్లు సాగుతున్నాయి. మొదట పత్తి క్వింటాల్‌కు సీసీఐలో మద్దతు ధర రూ.8,110 ప్రకటించి కొనుగోలు చేసింది. ఇరవై రోజుల్లో రెండుసార్లు మద్దతు ధరలో కోత విధించింది. రూ.వంద తగ్గించి ప్రస్తుతం సీసీఐలో రూ.8,010 చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7000 వరకు చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ ద్వారా 9,36,162 క్వింటాళ్లు, ప్రైవేటులో 23,043 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అమ్మబోతే అడవి..
అమ్మబోతే అడవి..


