‘పది’మిత అల్పాహారం!
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు 19 రోజులకే నిధులు కేటాయింపు గత ఏడాదితో పోల్చితే సగం రోజులకు కుదింపు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల అసంతృప్తి
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అందించే అల్పాహారంపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. తరగతులు జరిగినన్ని రోజులు కాకుండా పరిమిత రోజులకు కుదించడం, ఒక్కపూట అల్పాహారం నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది అక్టోబర్ ఆరు నుంచి సాయంత్రం పూట ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత రెండు పూటల తరగతులకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు నిధులు మంజూరు చేస్తూ విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వరకు వినియోగించాలని, 19పని దినాలకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15చొప్పున వెచ్చించాలని పేర్కొన్నారు. నెలల తరబడి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా.. మొక్కుబడిగా 19రోజులకే అల్పాహారం పరిమితం చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆ రోజుల్లోనే ఎందుకు..!
పదో తరగతి విద్యార్థులు మూడు నెలలుగా సాయంత్రం 4.15గంటల నుంచి 5.15గంటల వరకు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యం అవుతుండడంతో ఆకలితో అలసట, నీరసించి చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. మార్చి 14న వార్షిక పరీక్షల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంపునకు సంక్రాంతి తర్వాత నుంచి రెండు పూటల ప్రత్యేక తరగతుల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఉదయం 8.15గంటల నుంచి 9.15గంటల వరకు తరగతుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పీఎంశ్రీ పాఠశాలలు మినహాయిస్తే 91 పాఠశాలల్లోని 2,885మంది విద్యార్థులకు సంబంధించి రూ.8.16లక్షలు మంజూరయ్యాయి. కేవలం 19రోజులకే పరిమితం చేయడంతోపాటు సాయంత్రం పూటకు అరకొరగా కేటాయించారు. గత ఏడాది ఫిబ్రవరి 1నుంచి మార్చి 20వరకు పాఠశాలలు నడిచే రోజుల్లో అల్పాహారం అందించారు. అప్పుడు 38రోజులు అల్పాహారం అందించగా ఈ ఏడాది సగానికి కుదించడం విమర్శలకు తావిస్తోంది. ఫిబ్రవరి 16నుంచి మార్చి 10వరకు నిధులు వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గతంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించేవారు. బడికి వచ్చేవారికి 45ని మిషాల ముందు అల్పాహారం వడ్డించేవారు. సోమవారం ఇడ్లి, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరి, ఆలుకుర్మా లేదా టమాటా బాత్, సాంబార్, బుధవారం ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ ఇలా రోజుకొకటి చొప్పున మెనూలో పొందుపర్చారు. తర్వాత కాలంలో నిధులు మంజూరు కాకపోవడం, నిర్వాహకులు ముందుకు రాక సీఎం బ్రేక్‌ఫాస్ట్ నిలిచిపోయింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేకపోగా.. సాయంత్రం పరిమితం చేయడంతో విద్యార్థులకు ఆకలి కష్టాలు తప్పేలా లేదు.


