సామర్థ్యాల గుర్తింపునకు ‘ఎఫ్‌ఎల్‌ఎస్’
న్యాస్ నుంచి ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీగా మార్పు మూడో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 26న పరీక్ష కొనసాగుతున్న మాక్ టెస్టులు
కెరమెరి: విద్యా ప్రమాణాల పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. జాతీ యస్థాయిలో పలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గ తంలో 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించిన న్యాస్ పేరును ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్)గా మార్చింది. ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థుల విద్యాసామర్థ్యాల గుర్తింపునకు ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, మాక్ టెస్టులు కొనసాగుతున్నాయి.
ఎస్‌సీఈఆర్టీ ఆదేశాల మేరకు..
మూడో తరగతి విద్యార్థులను విద్యా సామర్థ్యాలను పరీక్షించాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్‌సీఈఆర్టీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర కు పిల్లలకు చదవడం, రాయడంతోపాటు గణితంలో నాలుగు రకాల లెక్కలు చేయడంపై జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో ఈ ప్రక్రియను నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(న్యాస్) పే రుతో నిర్వహించేవారు. ప్రస్తుతం దానిస్థానంలో పలు మార్పులు చేసిన ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్)ను ప్రవేశపెట్టారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణితం సబ్జెక్టుల్లో విద్యా సామర్థ్యాలను పరి శీలించనున్నారు. జిల్లాలో 1,253 పాఠశాలల్లో 8,480 మంది మూడో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి మాత్రమే ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించనున్నారు.
కొనసాగుతున్న నమూనా పరీక్షలు
జిల్లాలోని పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్ష కోసం వి ద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. ప్రధాన పరీక్షకు ముందు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక మాక్ టెస్టు పూర్తయ్యింది. ఈ నెల మూడోవారంలో రెండో మాక్ టెస్టు, ఫిబ్రవరి రెండో వారంలో చివరి టెస్టు నిర్వహించనున్నారు. అధిక మార్కులు సాధించేందుకు ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా కేటాయించారు. పరీక్షల నిర్వహణకు రిసోర్స్ పర్సన్ల(ఆర్‌పీ)ను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
చదవడం, రాయడం, లెక్కించడంపై దృష్టి
ఇప్పటికే తొలి మాక్ టెస్టు పూర్తయ్యింది. దీని ఆధారంగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తున్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. మాక్ టెస్టులో 18 ప్రశ్నలు ఉండగా, ఇందులో 8 మౌఖిక, 8 రాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి. మొదటి పరీక్షలో కొంత వరకు సులువైన ప్రశ్నలు ఇచ్చారు. చదవడం, రాయడం, అంకెలు, సంఖ్యలను గుర్తించడం వంటివి చేయిస్తున్నారు. ఐదు ప్రశ్నల్లో నాలుగింటిని గుర్తిస్తే 80 మార్కులు వేస్తున్నారు. నాలుగింటి కంటే తక్కువ ప్రశ్నలు గుర్తిస్తే.. అలాంటి విద్యార్థులకు మరింత శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. చదవడం, రాయడంతోపాటు లెక్కించడంపై దృష్టి సారిస్తున్నారు.


