పారదర్శకంగా సదరం ధ్రువపత్రాల జారీ
ఆసిఫాబాద్‌అర్బన్: సదరం శిబిరాల్లో పారదర్శకంగా ధ్రువపత్రాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపులను గురువారం సందర్శించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సదరం శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత కలిగిన వారికి ధ్రువపత్రాలు అందించాలన్నారు. దివ్యాంగులు, వారి సహాయకులకు తాగునీరు, నీడ, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయంలోనే పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్యులకు సూచనలు చేశారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఏ రామకృష్ణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


