గంగాపూర్ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
రెబ్బెన: గంగాపూర్‌లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర మహోత్సవంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. మండలంలోని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, దేవాదాయశాఖ అధికారులతో కలిసి జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా వరుస క్రమంలో వెళ్లేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, వాహనాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పార్కింగ్ స్థలం, దుకాణ సముదాయాలు క్రమపద్ధతిలో ఉండేలా చూడాలని, పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రెబ్బెన నుంచి గంగాపూర్ వరకు రహదారిపై దుమ్ము లేవకుండా ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ కోతలు లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక బస్సులు నడిపించాలని, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి, పంచాయతీరాజ్, విద్యుత్, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


