పట్టు వీడని కార్మికులు
కాగజ్‌నగర్‌రూరల్: పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని 17 రోజులుగా సమ్మె చేస్తున్న కాగజ్‌నగర్ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు పట్టు వీడటం లేదు. ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమక్షంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో య థావిధిగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఐదు రో జులుగా కార్యాలయంలోకి అధికారులను వెళ్లనీయకుండా గేటు ఎదుటు బైఠాయిస్తున్నారు. మున్సిపాలిటీలో 188 మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా, 124 మంది పారిశుద్ధ్య పనులు, మిగతా వారు తాగునీరు, విద్యుత్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో నుంచి 15 మందిని ఆఫీసు కా ర్యకలాపాల కోసం కేటాయించారు. వీరికి మాత్రం వేతనాలు ఇచ్చి.. తమను విస్మరించడంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. అధికారుల అడుగులకు మడుగులొత్తే వారికి కార్యాలయంలో విధులు కల్పించి వేతనాలను చెల్లిస్తున్నారని ఆరోపించారు.
డీవైఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల మద్దతు
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు బుధవారం డీవైఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల నాయకులు మద్దతు పలికారు. కార్మికులతో కలిసి సమ్మెలో కూర్చున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిందని, కనీసం తాగునీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనిత, వినోద, మహిళలు పాల్గొన్నారు.


