‘మార్లవాయి ప్రగతికి పచ్చజెండా’
ఆసిఫాబాద్‌అర్బన్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ ప్రగతికి ప్రజా ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో మార్లవాయి గ్రామాన్ని సందర్శించి అక్కడి చరిత్ర, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి గ్రామాభివృద్ధికి రూ.91 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో ప్రొ.హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్‌ల కాంస్య విగ్రహాలు, స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీకి ఆహ్వానం
కెరమెరి: జైనూర్ మండలం మార్లవాయిలో ఈ నెల 11న నిర్వహించే హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్‌ల వర్ధంతికి హాజరుకావాలని ఎస్పీ నితిక పంత్‌ను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహణ కమిటీ సభ్యులతో మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిశారు.


