రోడ్డు భద్రత.. జీవితానికి రక్ష
కొనసాగుతున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఏటా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
జిల్లాలో జాతీయ రహదారితో పాటు అంతర్రాష్ట్ర రహదారులున్నాయి. వీటిపై నిత్యం వేలాది వాహనాలు అధికలోడుతో వెళ్తుండటంతో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటా పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రవాణాశాఖ, పోలీస్‌శాఖ అధికారులు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
– కౌటాల
జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, రహదారి భద్రత నియమాలు పాటించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏటా జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కల్పిస్తుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన 39 జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈ నెల 31 తేదీ వరకు కొనసాగనున్నాయి.
ప్రమాదాల్లో యువత..
మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణించే వారిలో ఎక్కువ సంఖ్యలో యువకులే ఉండడం కలిచివేసే అంశంగా ఉంది. అలాగే ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రమాదాల నివారణకు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ నియమాలు, లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన వారిని కఠినంగా శిక్షించాలి. మైనర్లు బైక్‌లు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 3,757 కేసులు నమోదు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 267 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో పలువురు మృతి చెందారు.
అవగాహన కార్యక్రమాలు..
‘వాహనదారులు ఒక్క క్షణం ఆలోచించండి.. రహదారి భద్రత నియమాలు పాటించండి.. ప్రాణం తీసే అతివేగాన్ని వదలండి.. ప్రమాదాల బారిన పడి కుటుంబాలకు దూరం కాకండి.. మిమ్మల్ని నమ్ముకున్న వారికి కన్నీటిని మిగల్చకండి’ అంటూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులకు రహదారి భద్రత ఆవశ్యకతను వివరిస్తున్నారు. ‘రహదారి భద్రత.. మన జీవన భద్రత’ అని 39వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా పలు చోట్ల ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కేంద్రం, కాగజ్‌నగర్ పట్టణం, ఆయా మండల కేంద్రాల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 40కి పైగా ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నియంత్రణకు మూల మలుపుల గుర్తింపు, స్పీడ్ బ్రేకర్లు, సూచికలు ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.
నిర్లక్ష్యంగా నడిపితే ప్రమాదాలు..
నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల భద్రత, రక్షణ ధ్యేయంగా పోలీస్‌శాఖ పని చేస్తుంది. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రమాదాలతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏటా రోడ్డు ప్రమాదాల్లో యువకులు, కుటుంబ పెద్దలు మృతి చెందుతుండడంతో కుటుంబాలు దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు.
– నితిక పంత్, ఎస్పీ
రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు (ఫైల్)


