మున్సి‘పోల్’కు సై!
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాజకీయ పార్టీలు చైర్మన్ పీఠం వశం చేసుకునేందుకు వ్యూహాలు
ఆసిఫాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపల్ నగారా మోగనుంది. రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాచుకుంది. కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబా ద్ మున్సిపాలిటీలో తొలిసారి మున్సిపల్ ఎన్ని కలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని పార్టీలు కసరత్తు ప్రా రంభించాయి. రాజకీయ పార్టీలు వార్డుల వారీ గా ఓటర్లు, సామాజిక వర్గాల లెక్కలు వేసుకుంటున్నాయి. ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవాలని కసరత్తు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో విజ యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల పదవీ కాలం గతేడాది జనవరిలో ము గియగా, 11 నెలలుగా ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది.
జిల్లాలో 65,110 మంది ఓటర్లు
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో మొత్తం 65,110 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 31,125 మంది పురుషులు, 33,985 మంది మహిళలు ఉన్నారు. ఆసిఫాబా ద్ మున్సిపాలిటీలో జిల్లా కేంద్రంతో పాటు గొడవెళ్లి, జన్కాపూర్ గ్రామాలు కలిపి 20 వా ర్డులు ఉండగా, 13,905 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో 6,811 మంది పురుషులు, 7,092 మంది మహిళలు ఉన్నారు. కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉండగా 25,004 మంది పురుషులు, 26,193 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇప్పటికే పలుమార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తాజాగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మంది రంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల య్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రిజర్వేషన్లు కలిసొస్తే..
రిజర్వేషన్లు కలిసొస్తే మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఆశావహులకు రిజర్వేషన్లపై గుబులు పట్టుకుంది. ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు. తొలిసారి ఎన్నికలు జరుగుతున్న ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో బీసీల జనాభా అధికంగా ఉండడంతో రిజర్వేషన్లు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఆయా సామాజిక వర్గాల వారు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. రిజర్వేషన్లు కలిసొస్తే పలువురు రాజకీయ నాయకులు పోటీకి సై అంటున్నారు. ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగే ఎన్నికల్లో చైర్మన్‌తో పాటు మెజారిటీ కౌన్సిలర్లను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. కాగజ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో పక్కా ప్లాన్ వేసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటికే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు, ఓటర్లకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది.


