కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత
మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అధికారుల యత్నం పోలీసులు కార్మికుల మధ్య తోపులాట కార్మికురాలికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు కలెక్టర్‌తో చర్చలు విఫలం
కాగజ్‌నగర్‌రూరల్: మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్రిక్తతంగా మారింది. మంగళవారం రాత్రి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇందులో శంకరమ్మ అనే కార్మికురాలు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వెంటనే ఆమెను చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కార్యాలయంలోనికి వెళ్లే యత్నం..
గత నాలుగు రోజులుగా మున్సిపల్ కార్యాలయంలోకి కమిషనర్‌తో సహా సిబ్బందిని వెళ్లనీయకుండా కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో అధికారులు పోలీసుల సహాయంతో మంగళవారం రాత్రి కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్ర యత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. కాగా కార్మికులకు రావాల్సిన వేతనాల కోసం న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్నార ని, కార్మికులకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్‌కుమార్, రాజేందర్‌లు పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసులతో సమ్మెను అణిచివేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకుండా రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలన్నారు.
చర్చలు విఫలం..
గత 16 రోజులుగా సమ్మె చేస్తున్నా అధికార యంత్రాంగం వేతనాలను అందించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ స్పెషల్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కమిషనర్ రాజేందర్ సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి. మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్మికులతో చర్చలు జరిపారు. ఒక నెల వేతనం మాత్రమే రెండు, మూడు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో అంగీకరించని కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తామని పేర్కొంటూ చర్చల నుంచి వెళ్లిపోయారు.


