ఊరెళ్తున్నారా.. సమాచారం ఇవ్వండి
ఆసిఫాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న జిల్లా వాసులు సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సమేతంగా ఊరెళ్తుండడంతో చాలా రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇస్తే పెట్రోలింగ్ సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా పెడుతారని పేర్కొన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, తదితర విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకూడదని, ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చోరీలను నివారించవచ్చని, ప్రశాంతంగా పండుగ జరుపుకోవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని సూచించారు.


