పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతం
ఎమ్మెల్సీ, అధికారులతో చర్చలు విఫలం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. పెండింగ్ వేతనాలు చెల్లించాలని 14 రోజులుగా కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తుండగా, శనివారం కార్యాలయ కార్యకలాపాలను స్తంభింపజేవారు. రాత్రిపూట కార్యాలయం ఎదుట నిద్రించారు. కార్యాలయ పనులు చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం వేతనాలు అందించి.. వార్డుల్లో పనిచేసే తమకు జీతాలను అందించడం లేదని మండిపడ్డారు.
వేతనాలు ఇచ్చే వరకూ పోరాడుతాం
కార్మికులకు వేతనాలు ఇచ్చేంత వరకు మద్దతు ఇస్తూ పోరాడుతామని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి మున్సిపల్ కార్మికులతో కలిసి కార్యాలయం ఎదుట నిద్రించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
చర్చలు విఫలం
మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ వహీదుద్దీన్, కమిషనర్ రాజేందర్ సమక్షంలో కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రెండు నెలలకు సంబంధించిన వేతనాలను ఇప్పిస్తామని హామీ ఇవ్వగా, మరో నెల వేతనం ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు ముందుకొచ్చారు. కానీవేతనాలు చెల్లింపునకు రెండు, మూడు రోజులు గడువు కావాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు ఈ అంగీకారానికి ఒప్పుకోలేదు. ఈ రోజే వేతనాలను ఖాతాల్లో జమ చేస్తే తప్ప సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. సుమారు గంట పాటు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని నాయకులు తెలిపి బయటకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్ కుమార్, శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


