గూడెంలో పౌర్ణమి జాతర
దండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెంలో గల శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం పుష్యపౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 133 జంటలు సామూహిక సత్యనారాయణవ్రతాలు నోముకున్నాయి. జాతరకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జాతర సందర్భంగా గూడెం ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి.
విద్యార్థిని మృతికి కారణమైన ఆర్‌ఎంపీ అరెస్ట్
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని కోయవాగు గ్రామానికి చెందిన మధురవేణి అక్షర మృతికి కారణమైన ఆర్‌ఎంపీ తన్నీరు బిక్షపతిని అరెస్ట్ చేసినట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సందీప్ తెలిపారు. చింతగూడ కోయవాగులో శ్రీలత, రవి దంపతుల కుమార్తె అక్షర ఆసిఫాబాద్‌లోని కేజీబీవీలో ఆరోతరగతి చదువుతోంది. జ్వరం, వాంతులు కావడంతో ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు సమీపంలోని భిక్షపతి అనే ఆర్‌ఎంపీ వద్ద నవంబర్ 11 నుంచి మూడురోజుల పాటు వైద్యం చేయించారు. నయం కాకపోవడంతో అతని సూచన మేరకు కాగజ్‌నగర్‌లోని డయోగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించారు. యూరిన్ ద్వారా బ్లడ్ కోల్పోతుందని రిపోర్టు రావడంతో మొదట హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి, ఆతర్వాత నిలోఫర్‌లో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి డిసెంబర్ 29న మృతి చెందింది. ఆర్‌ఎంపీ ఇచ్చిన హైడోస్ ఇంజిక్షన్ల వల్ల కిడ్నీలు చెడిపోయి మృతి చెందిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గూడెంలో పౌర్ణమి జాతర


