జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు
కెరమెరి(ఆసిఫాబాద్): జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కెరమెరి మండలంలోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహాపూజ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యవత్మాల్ ఎమ్మెల్యే తొడసం రాజు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు వారికి తలపాగాలు చుట్టారు. ఎంపీ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్, తదితర నుంచి భక్తులు వస్తారని తెలిపారు. గిరిజన ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు చరిత్ర అందించాలన్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు
జంగుబాయి అమ్మవారి ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన జంగుబాయి దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సమన్వమ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు యవత్మాల్ ఎమ్మెల్యే రాజు తెలిపారు. అంత కు ముందు పోచమ్మకు పూజలు చేశారు. దేవతలకు మొక్కులు చెల్లించి, కొత్త కోడళ్లతో భేటింగ్ అయ్యారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సలాం శ్యాంరావు, అధ్యక్షుడు కొడప జాకు, గౌ రవ అధ్యక్షుడు మరప బాజీరావు, పుర్క బాపూరావు, ఆర్డీవో లోకేశ్వరరావు, డీపీవో భిక్షపతి, గిరిజనశాఖ డీడీ రమాదేవి పాల్గొన్నారు.
జంగుబాయి ఆలయ అభివృద్ధికి చర్యలు


