
స్టూడెంట్ లీడర్లు!
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతీ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ఆధారంగా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. కలిసి పనిచేయడం ద్వారా పిల్లల్లో జట్టు భావన, బాధ్యత, నిర్ణయ సామర్థ్యం, సమయ పాలన, సామాజిక బాధ్యత వంటి విలువలు పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలో 60 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, 101 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 32 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్రతీ బడిలో నాలుగు కమిటీలు..
ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మహనీయుల పేర్లతో ఏర్పాటు చేసే బృందాలకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు రంగులు కేటాయిస్తారు. కెప్టెన్, వైస్ కెప్టెన్‌లుగా పై తరగతుల విద్యార్థులు వ్యవహరిస్తారు. బృందంలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు బాలికలు తప్పనిసరిగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడి నిధి నుంచి బృందాలకు ఒక్కో రంగు యూనిఫాం కేటాయించాలి. ఒక ఉపాధ్యాయుడు సలహాదారుడిగా వ్యవహరిస్తారు. వీరు ప్రతీనెల మూడో శనివారం సమావేశం నిర్వహించి పాఠశాల సమస్యలపై చర్చిస్తారు.
పర్యవేక్షణలో కీలకం..
విద్యార్థుల కమిటీలు పాఠశాలలో వివిధ పనులను పర్యవేక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిరోజూ విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజ నం నాణ్యతను పరిశీలించాలి. ఉదయం ప్రార్థన చేయించాలి. తోటి పిల్లలకు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. క్రమశిక్షణతో జట్టుగా పనిచేసేలా ప్రోత్సహించాలి. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అనేక బృందాలు పనిచేస్తున్నాయి. పచ్చదనం, పరిశుభ్రతకు ఏకో క్లబ్‌లు పనిచేస్తున్నా యి. భద్రత, బాలిక సాధికారత, ఆరోగ్యం, ప్రహరీ, లైబ్రరీ, సాహిత్య, సాంస్కృతిక, కళలు, క్రీడలు వంటి ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల కమిటీలు ఆయా క్లబ్‌లను సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది.
విద్యార్థుల కమిటీల పేర్లు, కేటాయించిన రంగులు
పేరు కేటాయించిన రంగు
అబ్దుల్ కలాం ఎరుపు
శకుంతలాదేవి ఆకుపచ్చ
సీవీ రామన్ నీలం
రవీంద్రనాథ్ ఠాగూర్ పసుపు