
తెరుచుకోని కమ్మర్‌గాం గిరిజన ఆశ్రమ బడి
పెంచికల్‌పేట్(సిర్పూర్): మండలంలోని కమ్మర్‌గాం గిరిజన ఆశ్రమ పాఠశాల దసరా సెలవులు ముగిసి పదిరోజులు గడిచినా నేటికీ తెరుచుకోలేదు. ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు. కమ్మర్‌గాం ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు వందమంది చదువుకుంటున్నారు. దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో నాలుగు రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వస్తున్నా.. హెచ్‌ఎం రవికుమార్‌తోపాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. టీచర్లు పాఠశాలకు రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్‌ఎం రవికుమార్‌ను సంప్రదించగా.. సమావేశంలో పాల్గొనేందుకు ఆసిఫాబాద్‌కు వెళ్లినట్లు సమాధానం ఇచ్చారు. అలాగే ఏటీడబ్ల్యూవో శ్రీనివాస్‌ను సంప్రదించగా జర్నీలో ఉన్నట్లు తెలిపారు.