
గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలి
కాగజ్‌నగర్‌రూరల్: గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. శనివారం మండలంలోని బలగాల మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలలు గడుస్తున్నా వేతనాలు రాకుండా గురుకుల ఉపాధ్యాయులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రెగ్యులర్ స్కేల్ అమలు చేయాలని, గెస్ట్, పార్ట్‌టైం ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాలు మంజూరు చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్‌కమలాకర్‌రెడ్డి, కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు మైపాల్, జిల్లా కమిటీ సభ్యుడు మహేష్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.