
కోర్టు భవన నిర్మాణం చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి భీమపాక నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా విచ్చేసిన ఆయనను స్థానిక న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ.12 కోట్లతో కోర్టు భవన సముదాయాలు మంజూరు చేయగా జిల్లాకు మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కోర్టు నిర్మాణానికి కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు బోనగిరి సతీశ్‌బాబు, నరహరి, ముక్త సురేశ్, రాజీవ్‌రెడ్డి, జగన్మోహన్ రావు, రామకృష్ణ, సత్యశ్రీలత, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.