
‘కాగజ్‌నగర్’లో పులి సంచారం
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు డప్పుచాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం పలు గ్రామాల్లో పులి సంచారంపై డప్పు చాటింపు నిర్వహించారు. గస్తీ బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. అయితే కెమెరాల సహాయంతో కదలికలను పర్యవేక్షిస్తున్నప్పటికీ పెద్దపులి జాడ చిక్కడంలేదు. దీంతో పాదముద్రల ఆధారంగా బెబ్బులి ఏ వైపునకు వెళ్తుందో అంచనా వేస్తున్నారు. పెద్దపులి ఎవరికై నా కనిపిస్తే తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. రైతులు ఒంటరిగా రాత్రిపూట పంట చేలకు వెళ్లొద్దని, మధ్యా హ్న సమయంలో గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. కాగా పాదముద్రల ఆధారంగా డివిజన్‌లోకి కొత్తపులి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి పులి కాగజ్‌నగర్ డివిజన్‌లోకి చేరినట్లు నిర్ణయానికి వచ్చి కదలికలపై నిఘా పెట్టారు. జాడ కనుగొనేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటివరకు ఏ కెమెరాలోనూ పులి ఆనవాళ్లు చిక్కలేదు. కొత్త పులి జాడను కనుగొనేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని కాగజ్‌నగర్ ఎఫ్‌ఆర్వో అనిల్‌కుమార్ తెలిపారు.