
ఎన్నికల చెక్‌పోస్టులు ఎత్తివేత
జిల్లాలో నిఘా కోసం మూడు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో తొలగింపు సాధారణ తనిఖీలు కొనసాగుతాయని అధికారుల వెల్లడి
వాంకిడి(ఆసిఫాబాద్): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టులను అధికారులు ఎత్తివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిపోయాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో 24 గంటలపాటు నిఘా పెట్టారు. నగదు, మద్యం, ఓటర్లను మభ్యపెట్టే వస్తువుల తరలింపుపై ఆంక్షలు విధించారు. ఆయుధాల తరలింపు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపైనా దృష్టి సారించారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై గురువారం హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ కోడ్‌ను నిలిపివేయగా, జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించారు.
మూడు చెక్‌పోస్టులు..
స్థానిక ఎన్నికల కోడ్‌లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దున అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రం నుంచి అక్రమ రవాణాకు ఆస్కారం ఉండటంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఉత్తర్వులను జారీ చేశారు. నగదు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద, సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేట్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్, సిర్పూర్(టి) నుంచి విరూర్ వెళ్లే రోడ్‌లోని దుబ్బగూడ వద్ద ఈ ఎన్నికల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. ప్రతీ చెక్‌పోస్ట్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్(ఎస్‌ఎస్‌టీ)ను నియమించారు. వాంకిడి చెక్‌పోస్ట్ వద్ద ఆర్‌ఐ(గిర్దావార్)తోపాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు ఏఎస్సైలకు విధులు కేటాయించగా, వెంకట్రావ్ చెక్‌పోస్ట్ వద్ద ఆర్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీడియో గ్రాఫర్, దుబ్బగూడ చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు జీపీవోలు, పోలీస్ కానిస్టేబుల్, ఒక వీడియోగ్రాఫర్‌కు విధులు కేటాయించారు.
కోడ్ ఆంక్షలకు బ్రేక్..
ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు తొలగించారు. ఎన్నికల కోడ్ ఆంక్షలు అమలులో ఉండవు. ఎప్పటిలాగే సాధారణ తనిఖీలు మాత్రమే నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, వస్తువుల రవాణాను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఒక వాహనంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పట్టుబడినా.. రూ.10 వేలకు పైగా విలువైన మద్యం, బహుమతులు, ఇతర వస్తువులు తరలించినా సీజ్ చేస్తారు. వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపాలి. బ్యాంకు నుంచి తీసుకున్న నగదుకు విత్‌డ్రా స్లిప్‌లు, పాన్‌కార్డు, అకౌంట్ బుక్, వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు వంటివి ఉండాలి. అలాగే వైద్యం, పెళ్లి కోసం తీసుకెళ్తున్న నగదు, నగలు అయితే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఆస్పత్రికి సంబంధించిన రసీదు, వివాహ వేడుకలకై తే వివాహ ఆహ్వాన పత్రం లేదా కల్యాణ మండపం బుకింగ్ వంటి ఆధారాలు ఉంచుకోవాలి. చెక్‌పోస్టుల ఎత్తివేత విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్‌ను వివరణ కోరగా.. హైకోర్టు స్టేతో ఎన్నికల కోడ్ తొలగించినందున ఎన్నికల నిబంధనలు, ఆంక్షలకు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు తెలిపారు. మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు కోడ్ అమల్లోకి వస్తుందని, అప్పటివరకు సాధారణ తనిఖీలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొన్నారు.