సి.మాధవరెడ్డి | Sakshi
Sakshi News home page

సి.మాధవరెడ్డి

Published Sat, Apr 20 2024 1:50 AM

నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జు, నాయకులు  - Sakshi

తొలి ఎంపీ..
● హైదరాబాద్‌ రాష్ట్రంలో తొలి ఎన్నికలు ● సోషలిస్టు పార్టీ తరఫున ఆదిలాబాద్‌ నుంచి పోటీ ● 25వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో విజయం
కాంగ్రెస్‌ అభ్యర్థి ఆస్తులు రూ.54.60 లక్షలు

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజ కవర్గం 1952లో ఆవిర్భవించింది. మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్‌ స్థానంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో 21ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి 1952 మార్చి 27న తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో సోషలిస్టు పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున సి.మాధవరెడ్డి పోటీ చేయగా, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జేవీ నర్సింగ్‌రావు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,51,017 మంది ఓటర్లున్నారు. కాగా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో సగానికిపైగా ఓటర్లు ఓటు హక్కు విని యోగానికి దూరంగా ఉన్నారు. తొలి సారిగా జరిగిన ఎన్నికల్లో 1,56,907 (44.7శాతం)ఓట్లు పోలయ్యాయి. 1,94,110 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా ఆ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటు చెల్లుబాటు కావడం గమనార్హం.

తొలి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో చెరుకు మాధవరెడ్డి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన ఆయనకు 90,995 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి నర్సింగ్‌రావుకు 65,912 ఓట్లు పోలయ్యాయి. దీంతో మాధవరెడ్డి 25,083 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి ఆదిలాబాద్‌ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాధవరెడ్డి కాంగ్రెస్‌, టీడీపీల నుంచి కూడా పదవులు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మూడు పార్టీల్లో సాగింది. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1962లో బోథ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్బావంతో ఆ పార్టీలో చేరిన ఆయన రెండోసారి 1984లో మరోసారి ఎంపీగా విజయం సాధించారు.

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజ కవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్షాధికారే. శుక్రవారం ఆమె తరఫున దాఖలు చేసిన నామినేషన్‌ అఫిడవిట్‌లో తనకున్న ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పేర్కొన్నారు. చరాస్తులు రూ.12లక్షల 10వేలు ఉండగా, తన భర్త భుజంగ్‌రావు పేరిట రూ.42వేలు ఉన్నట్లుగా తెలిపారు. స్థిరాస్తులు తన పేరిట రూ.42లక్షల 50వేలు ఉన్నాయి. అలాగే తన పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.23లక్షల 49వేల 224 అప్పులు ఉండగా, తన భర్త పేరిట రూ.29లక్షల 76వేల 946 అప్పు ఉన్నట్లుగా వెల్లడించిన ఆమె తనకు సొంత వాహనం లేనట్టుగా పేర్కొన్నారు. కాగా తనపై ఉద్యమ కాలం నాటికి సంబంధించి 50 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.

రెండో రోజు ఒకే నామినేషన్‌

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు కొనసాగింది. శుక్రవారం ఒకే నామినేషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, ఆ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆడె గజేందర్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజర్షి షాకు తొలిసెట్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement