ఖమ్మం సహకారనగర్: సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే కీలక సాధనమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 40మంది అధికారులకు సమాచార హక్కు చట్టంపై ఇస్తున్న శిక్షణలో గురువారం ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాక శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులకు అందే దరఖాస్తులను బాధ్యతాయుతంగా పరిశీలించి, చట్ట పరిధిలో సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. అంతేకాక ఇతర శాఖలకు దరఖాస్తులను బదిలీ చేసే సమయాన నిబంధనలను పాటించాలని తెలిపారు. చట్టం లక్ష్యాలను ప్రతీ అధికారి అర్థం చేసుకుని, ప్రజలకు సమాచారం అందించడంలో సానుకూల ధృక్పథంతో వ్యవహరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రాంతీయ శిక్షణ మేనేజర్ వి.ఆనంద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రామమూర్తి, కవి, గాయకుడు జయరాజ్, ట్రెయినీలు నవాబ్‌పాషా, టి.ధర్మసింగ్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాసరావు


