టాస్క్‌ఫోర్స్‌ను దించితేనే...
కనీస నిబంధనలు పాటించని నిర్వాహకులు ఫిర్యాదులు అందితేనే ఆహార భద్రత అధికారుల తనిఖీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది కొరతతో దృష్టి సారించని వైనం
ౖపైపె హంగులు.. ఆర్భాటం
పలు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో ౖపైపె మెరుగులతో ఆకర్షిస్తున్నా ఆహారం తయారీ గదులు, సరుకులు, ఆహార నాణ్యత మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. ఉద్యోగ, వ్యాపారాల ఒత్తిడితో పలువురు ఇటీవల హోటల్, రెస్టారెంట్ల ఆహారానికి అలవాటుపడ్డారు. యాప్‌ల్లో ఆర్డర్ పెడితే ఇంటికే వస్తుండటంతో పలువురు హోటల్ పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదనే ఆరోపణలు ఉండగా.. నిల్వ ఉన్న మాంసం, గడువు తీరిన సామగ్రి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక కిచెన్లలో అపరిశుభ్రమైన వాతావరణం ఆందోళన కలిగిస్తోంది.
నిబంధనలు గాలికి..
హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించడం లేదు. లైసెన్స్ ప్రదర్శించడం, స్వచ్ఛమైన తాగునీరు సరఫరా, వంట మనుషులకు ఆరోగ్య పరీక్షలు, మూడు నెలలకోసారి పెస్ట్ కంట్రోల్ చేయించడమే కాక వంట గది, స్టోర్‌రూమ్‌ల్లో పరిశుభ్రత, ఫ్రిజ్‌లో శాఖాహారం, మాంసాహారాలను వేర్వేరుగా నిల్వ చేయాల్సి ఉంటుంది. అలాగే, తయారీ, గడువు తేదీ ఉన్న సామగ్రి ప్యాకెట్ల వినియోగించాలనే నిబంధనలు ఉన్నా జిల్లా కేంద్రంలోని కొన్నిచోట్ల మినహా ఎవరూ పాటించడం లేదు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో పాటు దాబాలు, బేకరీలు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అందులో ఆహారం తినే వారి ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తనిఖీ అధికారుల కొరత
జిల్లాలో 3,500కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయని అంచనా. వీటిల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. కానీ అధికారుల కొరత కారణంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీ చేపట్టే పరిస్థితి కానరావడం లేదు. ఇదే అదునుగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆహార భద్రత అధికారులు ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు కేవలం 455 చోట్లే తనిఖీలు చేపట్టారు. ఇందులో 20 వ్యాపార సంస్థలు నిబంధనల ప్రకారం లేవంటూ మెరుగుపర్చుకోవాలని నోటీసులు జారీ చేశారు. మరో రెండు వ్యాపార సంస్థల అనుమతులు రద్దు చేయడమే కాక పలు దాబాలు, హోటళ్లకు రూ.4.50 లక్షలకు పైగా జరిమానా విధించారు. ఎనిమిది క్రిమినల్ (అన్‌సేఫ్) కేసులు నమోదు చేశారు. అయితే, తనిఖీలు నిరంతరం కొనసాగితే నిర్వాహకుల్లో భయం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
ఆహార తనిఖీ శాఖ అధికారులు, సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు అప్పుడప్పుడే చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన అధికారుల తీరుతో హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులకు భయం లేకుండా పోయింది. ఇవన్నీ కలిపి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యాన హైదరాబాద్ తరహాలో జిల్లాలోనూ టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు చేపడితేనే ఆహార నాణ్యత మెరుగుపడుతుందనే భావన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ చూపితే జిల్లా వాసుల ఆరోగ్యానికి భరోసా లభించనుంది.
హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రమాణాలకు పాతర


