ఖమ్మం అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల సంక్షేమానికి పలు పథకాలను అమలుచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ దివాకరతో కలిసి ఆయన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం కూడా చీరలు పంపిణీ చేసినా అవి నాసిరకంగా ఉండేదని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం వేడుకలకు సైతం ధరించేలా అత్యంత నాణ్యతమైన చీరలు అందిస్తోందని చెప్పారు. గత ఏడాది పాలపిట్ట రంగు చీరలు, ఈ ఏడాది చిలకపచ్చ రంగు చీరలను అందిస్తున్నామని, ఏటా ఒక కొత్త రంగుతో కోటి మంది ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా పోటీలు
సుమారు 26ఏళ్ల తర్వాత తెలంగాణలో ఖేలో ఇండి యా యూత్ గేమ్స్ జరగనుండడం, ఖమ్మంలో ఆర్చరీ పోటీల నిర్వహణకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చేనెల 11 నుంచి జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్, బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంను ఆర్చరీ పోటీల వేదికగా ఎంపిక చేయడంతో ఆధునికీకరణకు నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ చైర్మన్లు ఖాదర్ బాబా, హన్మంతరావు, మెప్మా పీడీ నళినీ పద్మావతి, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, కేఎంసీ సహాయ కమిషనర్ అనిల్‌కుమార్, మాజీ మేయర్ నీరజ పాల్గొన్నారు.
చీరల పంపిణీలో
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


