ఆలయ నిర్మాణంలో భక్తులంతా భాగస్వాములు కావాలి
భూమి పూజలో త్రిదండి చినజీయర్ స్వామి
ఖమ్మంఅర్బన్: కులమతాలకు అతీతంగా ప్రతీఒక్కరు ధర్మమార్గంలో పయనించాలని, తద్వారా వారికే కాక మరో పది మందికి మేలు జరుగుతుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. కులాల పేరుతో ఎవరూ విడిపోవద్దని, అందరూ భగవంతుడి సంతానం, ఒకే భూమాతకు చెందిన వారిగా గుర్తించాలని సూచించారు. ఖమ్మం ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం శుభసూచకమన్నారు. ఖమ్మంలోని కొత్తగూడెం – అల్లీపురం మధ్య శ్రీవారి ఆలయ నిర్మాణానికి సోమవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి చిన జీయర్ స్వామి భూమిపూజ నిర్వహించారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించిన జీయర్‌స్వామి మాట్లాడుతూ అందరిపై భేదభావాలు లేకుండా భగవంతుడి అనుగ్రహం ఉండాలని కోరుకోవడం భారతీయ సంస్కృతిలోని గొప్ప లక్షణమని తెలిపారు. భగవంతుడి దృష్టిలో కులం, హోదా కంటే భక్తి, మంచి మనసు, ధర్మబద్ధమైన జీవనానికే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజలకే కాక ధర్మం, మానవత్వం, పరస్పర సహకారం, సమాజ శ్రేయస్సును పెంపొందించే కేంద్రాలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి భక్తులంతా తమకు తోచిన విధంగా విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు మాట్లాడుతూ ఖమ్మంలో ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి ప్రధాన కారణమని తెలిపారు. భూమిపూజలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని వెల్లడించిన మంత్రి తుమ్మల... ఇందుకు సహకరించిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
విరాళాల ప్రకటన
ఆలయ నిర్మాణానికి ఎంపీ బండి పార్ధసారథిరెడ్డి రూ.60 లక్షలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.50 లక్షలతో పాటు ఎమ్మెల్సీ తాతా మధు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే, కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేసిన కుమ్మరికుంట శ్రీనివాస్ అదనంగా రూ.11 లక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర ఈ.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్‌దత్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, కూనంనేని సాంబశివరావు, టీటీడీ జేఈఓ ఏ.శరత్, సుడా, మార్కెట్, పీఏసీఎస్‌ల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యరగర్ల హన్మంతరావు, రావూరి సైదబాబు, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, వీవీసీ గ్రూప్స్ ఎండీ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు ఎర్నేని రామారావు, రాయల నాగేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, పారా నాగేశ్వరరావు, రావూరి కరుణ, కమర్తపు మురళి, తుమ్మల యుగంధర్, గిరి, నాగండ్ల దీపక్‌చౌదరి, సంక్రాంతి నాగేశ్వరరావు, చేతుల నాగేశ్వరావు, వడ్డెపుడి మల్లేష్, వేములపల్లి వెంకటేశ్వరరావు, తుపాకుల యలగొండస్వామి, యర్రబోయిన గోవిందరావు, పగడాల మల్లేష్, రావుల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంతో ఖమ్మంకు ఆధ్యాత్మిక శోభ


