యాసంగిలో పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలకే ప్రాధాన్యత
కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మం సహకారనగర్: వర్షాకాలంలో సాగు చేసిన పంటలను కాపాడేలా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు ప్రణాళికాయుతంగా తడులు అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రతీ మండలంలో పంటల పరిస్థితి, ఎండిపోయే దశలో ఉన్న పంటలు, సాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న వనరుల వివరాలు సేకరించి ఎన్ని తడుల నీరు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే, సీతారామ ప్రాజెక్టు వద్ద నీటి లభ్యతపై చీఫ్ ఇంజినీర్‌కు ఫోన్ చేసి వివరాలు సేకరించిన కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి విడుదల సాఫీగా సాగేలా ప్రతీ రెగ్యులేటర్ పాయింట్ వద్ద రెవెన్యూ, పోలీసు ఉద్యోగులను నియమించాలని తెలిపారు. పాలేరు జలాశయం నుంచి కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ప్రధాన కాల్వలతో పాటు ఇతర కాల్వల పరిధిలో పంటలకు రెండు తడుల నీరు అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. సాగర్‌లో అందుబాటులో ఉన్న నీటి ద్వారా పాలేరు జలాశయాన్ని నింపే అవకాశాలను కూడా పరిశీలించాలని తెలిపారు.
యాసంగిలో వరి సాగు వద్దు
ప్రాజెక్టులు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు రానున్న యాసంగి సీజన్‌లో పంటల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున వరికి బదులు పప్పుధాన్యాలు, ఆరు తడి పంటలకే ప్రాధాన్యత ఇచ్చేలా రైతులకు అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించాలని తెలిపారు. జల వనరుల శాఖ సీఈ వాసంతి, ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులు డి.పుల్లయ్య, ఎం.వీ.మధుసూదన్, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ పాల్గొన్నారు.


