ఐదేళ్ల లోపు చిన్నారులకు చికిత్స,
పౌష్టికాహారం
రెండు వారాల పాటు
తల్లుల సమక్షాన సంరక్షణ
అవగాహన కల్పిస్తే
మరింత మందికి ప్రయోజనం
ఖమ్మం వైద్యవిభాగం: తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడే పిల్లలను కాపాడేందుకు కేంద్ర ప్రభు త్వ సహకారంతో రాష్ట్రంలోని పలు ప్రధాన ఆస్పత్రుల్లో పోషకాహార పునరావాస కేంద్రాల(ఎన్‌ఆర్‌సీ)ను ఏర్పాటు చేశారు. ఈక్రమాన 2012లో జిల్లా జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కూడా ఎన్‌ఆర్‌సీ ఏర్పాటైంది. పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్నారులను అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఆర్‌బీఎస్‌కే బృందాల సభ్యులు గుర్తించి ఈ కేంద్రానికి పంపిస్తారు. అలాగే, ఎంసీహెచ్‌లో చికిత్సకు తీసుకొచ్చే పిల్లల్లో ఎదుగుదల, పౌష్టికాహార లోపం ఉంటే కూడా చికిత్స చేస్తూ పౌష్టికాహారం అందిస్తారు. అయితే, కేంద్రంపై అవగాహన లేక ఎక్కువ మంది వినియోగించుకోలేకపోతున్నారు. ఈ విషయమై అధికారులు దృష్టి సారిస్తే పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు పడనున్నాయి.
ఆకలి పరీక్షలు.. క్యాలరీలతో కూడిన డైట్
ఎన్‌ఆర్‌సీ కేంద్రంలో నెల వయస్సు మొదలు ఐదేళ్ల లోపు పిల్లలకు చికిత్సతో పాటు పోషకాహారం అందిస్తారు. తొలుత పిల్లలకు ఆకలిలో లోపాలను గుర్తించేలా వారి బరువు ఆధారంగా పౌడర్ ఇస్తారు. అందులో తిన్న పరిమాణాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. అనారోగ్యంతో ఉన్నట్లు తేలిన వారికి కిచిడీ, హల్వా, పల్లీ పట్టి, రాగి మాల్ట్, సగ్గుబియ్యం, పాలు, పిండి, సేమియా తదితర బలవర్ధకమైన పదార్థాలే కాక సిరప్‌లు, మందులు అందిస్తారు. అలాగే పిల్లల పరిశుభ్రత, పౌష్టికాహారం ప్రాధాన్యతపై తల్లులకు అవగాహన కల్పిస్తారు. పిల్లలతో పాటు ఉండే తల్లులు, సంరక్షకులకు ఇన్‌పేషంట్ విభాగం నుంచి ఆహారం సమకూరుస్తారు.
విస్తృత అవగాహన అవసరం
పెద్దాస్పత్రిలోని ఎంసీహెచ్‌లో ఉన్న పోషకాహార పునరావాస కేంద్రంపై జిల్లా ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. ఎంసీహెచ్‌కు వచ్చే చిన్నారులకే ఇక్కడ చికిత్స చేస్తుండగా.. మిగతా వారికి ఈ కేంద్రం ఉన్న విషయం తెలియదని చెప్పాలి. సబ్‌సెంటర్, పీహెచ్‌సీల స్థాయిలో అవగాహన కల్పిస్తే మరింత మందికి చేరువ అయ్యే అవకాశముంది. కాగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వాన కొనసాగే ఈ కేంద్రంలో వైద్యులు, స్టాఫ్‌నర్సులు, న్యూట్రీషనిస్ట్, కుక్, అంటెండర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడకు పిల్లలతో వచ్చే తల్లులు నిరుపేదలే కావడం, రెండు వారాల పాటు ఉంటే ఉపాధి కోల్పోతున్న నేపథ్యాన రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తారు. అయితే, 2023 సెప్టెంబర్ నుంచి ఈ భృతి పెండింగ్ ఉంది.
ఎంసీహెచ్‌లో పోషకాహార పునరావాస కేంద్రం


