పెనుబల్లి: మతాల వారీగా ఆలయాలు నిర్మించి దేవుళ్లకు పూజలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ విద్య నేర్పిన గురువును మర్చిపోకుండా కొందరు శిష్యులు ఆయనకు గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్న వైనమిది. పెనుబల్లి మండలం గణేష్‌పాడులో కొలువైన ఈ ఆలయం వివరాలు...
వేదశాస్త్రాల బోధన
కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి ముఖ్య శిష్యుల్లో ఒకరైన చంద్రమౌళీంద్ర సరస్వతీ స్వామి కొన్నేళ్ల క్రితం వేలాది మంది శిష్యులకు వేద శాస్త్రాలు బోధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కంచిపీఠం నుంచి ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు ఆయన వద్ద శిష్యరికం చేశారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీ ఎదురుగా ఉన్న కామాక్షి పీఠం నిర్వహణ బాధ్యతలను కూడా ఆయనే చూసుకునేవారట. పదేళ్ల క్రితం ఆయన కన్నుమూయగా, హైదరాబాద్‌లోని పీఠం పరిసరాల్లో ఖననం చేసేందుకు కొందరు అభ్యంతరం చెప్పగా శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి శిష్యులు ఇష్టపడలేదు. దీంతో పెనుబల్లి మండలం గణేష్‌పాడులోని సొంత స్థలంలో ఖననం చేశారు. అంతటితో ఆగక చంద్రమౌళీంద్ర సరస్వతీ స్వామిపై భక్తితో ‘బృందావనం’ పేరిట ఆలయం నిర్మించి ఆయన విగ్రహం పెట్టారు. నిత్యం గుడిలో అర్చన చేయడమే కాక ప్రతీ గురుపౌర్ణమికి ఆయన శిష్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ నిర్వాహకులు అప్పయ్యశాస్త్రి, శ్రీనివాస శాస్త్రి వెల్లడించారు. తొలినాళ్లలో గణేష్‌పాడు వాసులు కూడా గురువు అంత్యక్రియలను ఇష్టపడకున్నా ఇప్పుడు ముఖ్యమైన పనిపై వెళ్లే క్రమాన దర్శించుకుని వెళ్తుండడం విశేషం.
గురువుకు గుడి.. విగ్రహానికి నిత్యపూజలు


