అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర క్రీడాకారులు ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వారావుపేట మినీ స్టేడియంలో శనివా రం ఆయన రాష్ట్ర స్థాయి అండర్–20 బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు పాల్గొన్నారు.
తొలిరోజు ఉత్సాహంగా..
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మినీ స్టేడియంలో రాత్రీపగలు మ్యాచ్‌లు నిర్వహించేలా నాలుగు కోర్టులను ఏర్పాటు చేశారు. తొలి మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం–సంగారెడ్డి జిల్లా జట్లు తలపడగా భద్రాద్రి జట్టు విజయం సాధించి బోణి కొట్టింది. అలాగే, ఖమ్మం–సూర్యాపేట జట్ల మధ్య పోటీలో ఖమ్మం, నల్లగొండ–ఆసిఫాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లో నల్లగొండ, భూపాలపల్లి–రంగారెడ్డి మ్యాచ్‌లో రంగారెడ్డి, మహబూబాబాద్– హైదరాబాద్ మ్యాచ్‌లో మహబూబాబాద్, కామారెడ్డి–మహబూబ్‌నగర్ మధ్య మ్యాచ్‌లో మహబూబ్‌నగర్, కరీంనగర్– సిద్దిపేట మ్యాచ్‌లో కరీంనగర్, జనగామ– జగిత్యాల మధ్య మ్యాచ్‌లో జనగామ, హైదరాబాద్–1, వనపర్తి మధ్య జరిగిన పోటీలో వనపర్తి జట్టు గెలిచింది. ఇక వరంగల్ – మంచిర్యాల మధ్య పోటీలో వరంగల్, మేడ్చల్ – నారాయణపేట మధ్య మ్యాచ్‌లో మేడ్చల్ జట్టు విజయం సాధించింది.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి


