నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పెద్దతండాలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆతర్వాత కూసుమంచి మండలం మంగలి తండాలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక, జీపీ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జుజ్జులరావుపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాది ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. సాయంత్రం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్‌, తెట్టలపాడులో అభివృద్ధి పనులను ప్రారంభించాక లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేయనున్నారు.

బీఆర్‌ఏఓయూలో ప్రవేశానికి 13వరకు గడువు

ఖమ్మం సహకారనగర్‌/కల్లూరు రూరల్‌: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి 13వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈమేరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకిరుల్లా, స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.వీరన్న, కల్లూరు స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శీలం ఇందిర సూచించారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ రెండో సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్‌ ఫీజు 13వ తేదీలోగా చెల్లించాలని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కాగా, ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కాలేజీలో ఈ ఏడాది కొత్తగా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయయని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

పీ ప్రైమరీ పాఠశాలల టీచర్లు, ఆయాలకు వేతనాలు

నేలకొండపల్లి: ప్రైవేట్‌గా దీటుగా చిన్నారులకు బోధించేందుకు జిల్లాలో గతంలో ఉన్న 28 ప్రీ ప్రైమరీ పాఠశాలలకు తోడు ఈ ఏడాది 114 కొత్తగా ఏర్పాటుచేశారు. ఇందులో బోధనకు ఇన్‌స్ట్రక్టర్లే కాక ఆయాలను ప్రభుత్వం నియమించింది. వీరికి జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ వేతనాలు విడుదల చేస్తూ సమగ్రశిక్షా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీనెలా ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8వేలు, ఆయాకు రూ.8వేల చొప్పున పాఠశాలకు రూ.14 వేలు విడుదల కాగా, హాజరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు. జిల్లాకు మంజూరైన రూ.59.64 లక్షలను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఖాతాల్లో జమ అయ్యాయని, కాంప్లెక్స్‌ పాఠశాల హెచ్‌ఎంలు డ్రా చేసి అందిస్తారని ఏఎంఓ పి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

బస్సు ఇంజన్‌లో నుంచి భారీ శబ్దం

వైరారూరల్‌: మండలంలోని తాటిపూడి వద్ద మధిర ఆర్టీసీ డిపో బస్సు ఇంజన్‌ భాగంలో నుంచి ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. మధిర డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సులో శనివారం 20 మందికి పైగా ప్రయాణికులతో వైరా వస్తోంది. మార్గమధ్యలో తాటిపూడి వద్ద ఇంజన్‌ భాగంలో నుండి భారీ శబ్ధం రావడంతో డ్రైవర్‌ అప్రమత్తమై పక్కన నిలిపాడు. ఆ తర్వాత మరమ్మతు చేసి ముందుకు తీసుకెళ్లడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

కమనీయం..

రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి నిత్యకల్యాణం శనివారం కమనీయంగా జరి గింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్నన శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులకు కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు

కొత్తగూడెంఅర్బన్‌: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం 12 రోజుల సెలవులు ప్రకటించింది. శనివారం నుంచి 21వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉండగా, 22 నుంచి కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సెలవుల నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే భోజనానికి బదులుగా ముందస్తుగానే టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) పంపిణీ చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు జిల్లాలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement