పట్టభద్రులను నమోదు చేయడంతోనే విజయం సర్వోత్తమ్‌రెడ్డి విజయం నల్లేరుపై నడకే.. సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఓటర్లను భారీగా నమోదు చేయడం ద్వారా విజయం సులువవుతుందని, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కాక మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి అర్హులను ఓటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి సీనియర్ నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించి, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతీ కుటుంబానికి ఆర్థిక భద్రతే
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వచ్చేనెల 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.5 లక్షల బీమా సాయం అందుతుందని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశలో మరో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కాగా, కాంగ్రెస్‌కు అంకితమైన సర్వోత్తమ్‌రెడ్డి కుటుంబానికి పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందని.. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రతీ సందర్భంలో అండగా నిలిచారని తెలిపారు. సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థిగా కాక కాంగ్రెస్ ప్రతినిధిగా భావించి ఆయన విజయం కోసం శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మొదటి ప్రాధాన్యత ఓటుతోనే
గెలుపు ఖాయం..
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఓటర్ల నమోదు చేపట్టడమే కాక, అభ్యర్థిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రేవంత్, రాహుల్ గౌరవానికి సంబంధించిన ఎన్నికగా భావించి కాంగ్రెస్‌పై కత్తి కట్టిన పార్టీలకు గుణపాఠం చెప్పాలని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, కోరం కనకయ్య, అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్ చౌదరితో పాటు నేతలు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, దొబ్బల సౌజన్య, మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.


