ఆ హెడ్‌ కానిస్టేబుల్‌పై వేటు! | - | Sakshi
Sakshi News home page

ఆ హెడ్‌ కానిస్టేబుల్‌పై వేటు!

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

● సీపీ కార్యాలయానికి అటాచ్‌

ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఓ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాన్ని దొంగచాటుగా ఇంటికి తీసుకెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘పోలీస్‌స్టేషన్‌లో దొంగ!’ శీర్షికన శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో బాధ్యుడైన హెడ్‌ కానిస్టేబుల్‌ను స్టేషన్‌ కీలక బాధ్యతల నుంచి తప్పించి సీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. అయితే, ఆయనపై ఒకటి, రెండు రోజుల్లో శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

ఎం.వీ.పాలెం సమీపాన

పులి సంచారం?

ఖమ్మంరూరల్‌: ఖమ్మంరూరల్‌ మండలం ఎం.వెంకటాయ పాలెం గ్రామ సమీపాన పెద్దపులి తిరుగుతోందనే ప్రచారం కలకలం రేపింది. గ్రామసమీపంలోని కంకర మిల్లు వద్ద పనిచేసే కొందరు పులిని చూసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ మార్గంలో వెళ్తున్న రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్‌ సాదిక్‌ అలీ కారును ఆపి వెల్లడించడంతో విషయం బయటకు వచ్చింది. పులి కాల్వ దాటి కంకర మిల్లు సమీపంలోని గుట్టలోకి వెళ్లిందని వారు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఇదే ప్రదేశంలో పెద్దపులి తిరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అప్పట్లో అటవీశాఖాధికారులు పరిశీలించి పాదముద్రల ఆధారంగా అడవి పిల్లి అని నిర్ధారించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు పెద్దపులి సంచరిస్తుందనే ప్రచారంపై ఆందోళన నెలకొన్నందున అటవీ అధికారులు పరిశీలిస్తే విషయం వెల్లడి కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement