ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వం అండ
ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులకు
రూ.లక్ష నుంచి ఆపై రుణ సాయం
జిల్లాలో 3,258 మందికి అందిన రూ.34.46 కోట్లు
మంత్రి పొంగులేటి చొరవతో పాలేరులో అత్యధికంగా 889 మందికి లబ్ధి
నియోజకవర్గాల వారీగా రుణాలు అందుకున్న లబ్ధిదారులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదల సొంతింటి కల నిజం చేసేలా ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తోంది. అయితే, స్థలం ఉండి, ఇళ్లు మంజూరైనా కొందరు ఆర్థిక సమస్యలతో నిర్మాణాలు మొదలు మొదలుపెట్టలేకపోతున్నారు. ఈక్రమాన లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైతే వారికి రుణం మంజూరు చేసి తొలి విడత బిల్లు వచ్చే వరకు పనులు కొనసాగేలా ప్రభుత్వం సహకరిస్తోంది. అధికారుల చొరవతో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 3,258 మందికి రుణాలు సమకూరాయి.
ఇళ్లు మంజూరైనా..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ కొందరు నిర్మాణాలు ప్రారంభించలేకపోయారు. పునాదులు తీయించడం, బేస్‌మెంట్ నిర్మాణానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు. ఈ విషయం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వెళ్లడంతో జిల్లా అధికారులతో మాట్లాడి లబ్ధిదారుల్లో స్వయం సహాయక సంఘాలు ఉంటే రుణం అందించేలా సూచనలు చేశారు.
కలిసొచ్చిన రుణాలు
ఇందిరమ్మ లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా అందిన రుణాలు కలిసొచ్చాయి. రుణంతో ఇంటి నిర్మాణం మొదలుపెడుతున్నారు. ఆ తర్వాత మొదటి బిల్లు వచ్చాక కొంత చెల్లిస్తుండగా.. మిగతాది వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కలిగింది. ఇక కాస్త స్థోమత ఉండి.. ఇంటిని మరింత సౌకర్యవంతంగా నిర్మించుకోవాలని భావించిన వారికి కూడా రుణాలు అండగా నిలిచాయి. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రూ.5లక్షలకు తోడు రుణ సాయంతో కలిపి పదికాలాలు ఉండే ఇంటిని ఆకర్షణీయంగా నిర్మించుకుంటున్నారు.
3వేల మందికి పైగా రుణసాయం
జిల్లాలోని ఇందిరమ్మ లబ్ధిదారుల్లో 3,258 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.34,46,93,000 రుణం మంజూరైంది. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి, రుణసాయం అవసరమైన వారిని గుర్తించారు. అందులో స్వయం సహాయక సభ్యులుగా ఉంటే రుణాలు ఇప్పించగా, సభ్యులు కాని వారిని సంఘాల్లో చేర్పించారు. సంఘాల్లో చేరగానే బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష వరకు రుణ సాయం అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపారు. అధికారులు తీసుకున్న శ్రద్ధతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అత్యధిక మందికి రుణసాయం అందగా.. ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా పని మొదలుపెట్టడానికి డబ్బులు లేవు. స్వయం సహాయక సంఘం ద్వారా రూ.లక్ష రుణం ఇవ్వడంతో నిర్మాణం చేపట్టాం. ఆ తర్వాత ఇళ్లు పూర్తయ్యేవరకు విడతల వారీగా రూ.5 లక్షలు ఖాతాలో జమ అయ్యాయి. ఇంకొంత అప్పు చేసి ఇంటి నిర్మాణం మంచిగా పూర్తిచేశాం. అసలు మొదలే పెట్టలేమనుకుంటే ముందుగానే రుణం ఇవ్వడం కలిసొచ్చింది.
– బాలిన మహాలక్ష్మి, బైరవునిపల్లి
నియోజకవర్గం లబ్ధిదారులు రుణం
పాలేరు 889 రూ. 10,16,16,000
సత్తుపల్లి 721 రూ. 8,84,71,000
వైరా 507 రూ. 6,04,11,000
మధిర 800 రూ. 5,40,25,000
ఖమ్మం 238 రూ. 2,93,00,000
ఇల్లెందు (కామేపల్లి) 103 రూ. 1,08,70,000
మొత్తం 3,258 రూ. 34,46,93,000


