ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి కలెక్టర్ దివాకర సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన తనిఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో కలియతిరుగుతూ ఓపీ రిజిస్ట్రేషన్, మందుల పంపిణీ, వైద్యులు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. రాత్రివేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారికి ఎక్కువ సేపు వేచి ఉండకుండా ఓపీ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తయ్యేందుకు, మందుల పంపిణీకి అదనపు కౌంటర్లు ఏర్పాటుచేయాలని సూచించారు. అంతేకాక ఆస్పత్రి ఆవరణ, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్, పంచాయతీరాజ్ ఈఈ మహేష్ బాబు, వివిధ విభాగాల అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ డీడీ, స్టడీసర్కిల్ కార్యదర్శి జి.జ్యోతి తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల కోసం అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి ఖమ్మం స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12న మొదలయ్యే శిక్షణ రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఉద్యోగ దరఖాస్తు కాపీ, డిగ్రీ, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. వివరాల కోసం 98667 26277, 90320 77276 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
బస్టాండ్‌లో సౌకర్యాల
కల్పనపై దృష్టి
వైరా: ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు నడిపించడమే కాక బస్టాండ్లలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. వైరా బస్టాండ్‌ను సోమవారం తనిఖీ చేసిన ఆయన ఆవరణ, పరిసరాలను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆర్‌ఎం మాట్లాడుతూ ఇప్పటికే బస్టాండ్ ఆధునికీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. సత్తుపల్లి డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ, వైరా స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


