టోల్ ఫ్రీ నంబర్లపై ప్రచారం
పనితీరు మార్చుకోకపోతే
ఎంఈఓల మార్పు
విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్ దివాకర
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేలా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున క్షేత్ర స్థాయిలో వాస్తవ మార్పు తీసుకురావాలన్నారు. నిరాశాజనకంగా ఉన్న కొందరు ఎంఈఓల పనితీరులో మార్పు రాకపోతే బాధ్యతల నుంచి తప్పించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. క్లస్టర్ హెడ్‌మాస్టర్లు ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుపై దృష్టి సారించాలని, నిపుణుల సూచనలను అమలు చేయాలని తెలిపారు. విద్యా సంవత్సరం ముగిసే నాటికి కనీసం 80 శాతం మంది విద్యార్థులు నిర్దేశిత ఎఫ్‌ఎల్‌ఎన్ సామర్థ్యాలను సాధించేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
తక్షణమే ఇంటర్నెట్ సౌకర్యం
కొన్ని పాఠశాలల్లో ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా శిక్షణపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ఏర్పాటుకు నెలక్రితమే నిధులు విడుదల చేసినా కొన్ని చోట్ల ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని, పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. అలాగే, దీపావళి అనంతరం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించాలన్నారు. ఈసమావేశంలో డీఈఓ డి.వాసంతి, ఎంఈఓలు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మంవ్యవసాయం: పత్తి తీతలు మొదలైనందున కేంద్రాల ఏర్పాటు, కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,667గా నిర్ణయించిందని, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.557 అధికమని తెలిపారు. జిల్లాలోని ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా ప్రాంతాల్లోని ఎనిమిది జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టనుండగా, సీసీఐ అధికారులు స్లాట్ వివరాలను ముందుగానే జిల్లా యంత్రాంగానికి తెలపాలని సూచించారు. తద్వారా స్లాట్ ఖాళీగా ఉన్న రోజే రైతులకు రవాణా ఖర్చు తగ్గి నిల్వలు పేరుకుపోకుండా ఉంటాయన్నారు. అలాగే, మిల్లుల్లో అగ్నిమాపక పరికరాలు, వేయింగ్ బ్రిడ్జిలు, సీసీ కెమెరాలను పరిశీలనలో పోలీసు, రవాణా శాఖ సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే, వ్యవసాయ శాఖ నిజమైన రైతులను గుర్తించాలని, కౌలు రైతులను తాత్కాలిక డేటాబేస్‌లో నమోదు చేయాలని సూచించారు. రైతుల వివరాలను ఎన్‌ఐసీ ద్వారా కపాస్ కిసాన్ యాప్‌కు బదిలీ చేసి, అగ్రి స్టాక్‌ను యాప్‌తో అనుసంధానం చేయాలని తెలిపారు. తేమ శాతం గుర్తించేలా 129 రైతు వేదికల్లో మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో తీసుకొచ్చి, నిర్దేశిత తేమ శాతం వచ్చే ఆరబెట్టుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779తో 88972 81111 వాట్సాప్ నంబర్ కొనసాగించాలని, వీటికి వచ్చే సమస్యలను రోజువారీగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అంతేకాక ప్రతీ మంగళవారం రైతు నేస్తం ద్వారా ఎఫ్‌ఏక్యూ, స్లాట్ బుకింగ్, కొనుగోలు కేంద్రాల వివరాలపై బ్రోచర్లు, పోస్టర్లు, మెసేజ్‌లతో విస్తృత ప్రచారం చేయాలన్నారు. కాగా, కనీస మద్దతు ధర పొందేలా ఆధార్ ధ్రువీకరణ, ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు సంతోష్, డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


