● సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆరోపణలు ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్‌లో అందరూ అసంతృప్తితో ఉన్నారు.. మంత్రులు ఎవరికి వారే ఆలోచిస్తున్నారు. అంతర్గత గొడవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆపలేకపోతున్నారు. జనాన్ని పకడ్బందీగా మాయ మాత్రం చేస్తున్నారు.’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యాన ఖమ్మంలో సోమవారం ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
చిల్లర గొడవలు ముందుకు..
సమస్యల నుంచి జనాల దృష్టిని మరల్చేందుకు అభ్యంతకరమైన పదాలను వాడుతున్నారని సీఎంను ఉద్దేశించి తమ్మినేని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయేందుకు చిల్లర గొడవలను ముందుకు తీసుకొస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ కూడా ప్రకటనలకే పరిమితం అవుతుందే తప్ప కార్యాచరణ ప్రకటించడం లేదన్నారు. రెండు పార్టీల నేతలు భూఆక్రమణలు, అక్రమ సంపాదనకు సంబంధించి పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేలా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం బీఆర్‌ఎస్ తమను సంప్రదించినా, ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
మూడో ఫ్రంట్‌కు అవకాశం లేదు..
రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌కు అవకాశం లేదని తమ్మినేని వెల్లడించారు. కమ్యూనిస్టుల సమీకరణ శక్తి తగ్గడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవహా రాల్లో వచ్చిన మార్పులు కొంత కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతర ఆందోళనలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం మధ్య ఐక్య కార్యాచరణ లేకుండా ఐక్యత సాధ్యం కాదన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని జెన్‌జీతో పాటు వామపక్షాలు, కలిసొచ్చే శక్తులను కలుపుకుని ఉద్యమిస్తామని తెలిపారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


