అశ్వాపురం: అశ్వాపురం మండలం అమెర్దలో ఓ యువకుడు మద్యానికి బానిసై చిన్న వయస్సులోనే మృతి చెందాడు. మరో యువకుడు మద్యానికి బానిస కాగా కుటుంబీకులు మందలిస్తే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలు గ్రామస్తులు కలిచివేయగా మద్యంతో ఎదురయ్యే నష్టాల పై చైతన్యం పెరిగింది. దీంతో మద్యపాన నిషేధానికి తీర్మానించారు. ఈమేరకు మద్యం వల్ల ఎదురయ్యే నష్టాలు, కష్టాలు, మద్యపాన నిషేధంపై లాభాలను స్థానికులు పలువురు సర్పంచ్ కొర్సా కృష్ణ, ఉపసర్పంచ్ మేకల అంజిబాబు, గ్రామపెద్దల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాలకవర్గం గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభలో మద్యపాన నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, అక్రమంగా సరఫరా చేసినా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.


