ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం – జయంతి బీటీ రోడ్డు అభివృద్ధి పనులతో పాటు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, రామాపురం – కొత్తపాలెం బీటీ రోడ్డు, రేమిడిచర్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేస్తారు. అలాగే, జమలాపురం జరిగే కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు.
నేడు ఉమ్మడి జిల్లాల్లో
మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో గ్రామ సమాఖ్య (వీఓ) భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి, కాకరవాయి, ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో పలువురి కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలాల్లో మంత్రి పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ దయాకర్‌రెడ్డి తెలిపారు.
జమలాపురంలో
అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ వారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవా ర్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్య లో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది, పాల్గొన్నారు.
సమయపాలన
పాటించకపోతే చర్యలు
● అదనపు కలెక్టర్ శ్రీజ
మధిర: వైద్యులు నిర్ణీత సమయంలో ఆస్పత్రిలో విధులు నిర్వర్తించాలని, అలాకాకుండా గైర్హాజరైనా, ముందస్తుగా వెళ్లిపోయినా చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ స్పష్టం చేశారు. మధిరలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు, రోజువారీ ఓపీని పరిశీలించాక మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, కౌన్సిలర్ రమణనాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయ్, నాయకులు డాక్టర్ రామనాథం, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రంగా శ్రీనివాసరావు, తన్నీరు రామకృష్ణ, మిరియాల వెంకటరమణగుప్తా పాల్గొన్నారు.,
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాలు
ఖమ్మంక్రైం: హైదరాబాద్‌లోని స్టేట్ పోలీసు అకాడమీలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఐదో పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా ఉద్యోగులు పతకాలు సాధించారు. షటిల్ బ్యాడ్మింటిన్, లాన్‌టెన్నిస్ తదితర పోటీల్లో అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, హెడ్‌కానిస్టే బుల్ దాసు, కానిస్టేబుల్ ఫయాజ్ బంగారు వెండి, కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. వీరిని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ శనివారం అభినందించారు.


