మళ్లీ కొత్తగూడెం నుంచే పోటీ.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కొత్తగూడెం నుంచే పోటీ..

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● సీపీఐతో పొత్తు కాంగ్రెస్‌కు నైతిక బలాన్ని ఇచ్చింది ● ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

● సీపీఐతో పొత్తు కాంగ్రెస్‌కు నైతిక బలాన్ని ఇచ్చింది ● ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘పార్టీ అంగీకారంతో నేను మళ్లీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తా.. పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మా పార్టీ నైతిక బలాన్ని ఇచ్చింది. మేము ఒకే సీటు తీసుకుని 118 నియోజకవర్గాల్లో మద్దతు ఇచ్చాం. అందుకే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని ఫ్రీగా వదిలేయాలి. నా గెలుపులో మంత్రి పొంగులేటి సహకారం ఉండగా.. అధికారికంగా కార్యక్రమాల్లో కలుపుకొని పోతున్నాం. ఎంపీ నా నియోజకవర్గంతో పాటు ఆయన పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు వెళ్లాలి. కానీ ప్రత్యేకంగా కొత్తగూడెం వస్తే నేనేదో వారి శత్రువు మాదిరి, వారిది నేను లాక్కున్న ఫీల్‌ వస్తోంది.’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ఇస్తామని చెప్పి ఇవ్వలేదు..

సీఎం రేవంత్‌రెడ్డి విద్యా రంగం మీద బాగానే పనిచేస్తున్నా.. అదంతా హైదరాబాద్‌పై కాకుండా అంతటా ఉండాలని కూనంనేని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినట్లు రైతులకు వంద శాతం రుణమాఫీ చేయాలన్నారు. అలాగే, పింఛన్లు పెంపు, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికల విషయంలో మద్దతు కోసం కాంగ్రెస్‌ ఇప్పటి వరకు తమను అడగలేదని తెలిపారు. కమ్యూనిస్టులు కొన్ని అంశాలపై కలిసే పోరాడుతున్నా, అంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఓ వైపు ప్రశ్నించే ధోరణి ఉంటే.. మరో వైపు ఆ ప్రశ్నలను అణిచివేసే ధోరణి నడుస్తుందన్నారు. యువత తమ ఆవేదనతో స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తుండడంతో ఆదిలోనే తుంచివేయాలి అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి కె.రాంనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్రంలోని బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఓటు హక్కు తొలగించడం నేరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేయడంతోనే దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. సీపీఐ ఖమ్మం జిల్లా సమితి సమావేశం శనివారం ఏనుగు గాంధీ అధ్యక్షతన జరగగా కూనంనేని మాట్లాడారు. బీజేపీ నేరాన్ని సైతం చట్టబద్దంగా మార్చడంతో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయని చెప్పారు. కొందరు మేధావులు పేదల సంక్షేమంపై వితండ వాదం చేస్తూ, సంపన్నులకు ఇచ్చే రూ.లక్షల కోట్ల రాయితీలపై మాట్లాడడం లేదని విమర్శించారు. కాగా, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ తీరు మార్చుకోవాలని సూచించారు. కేవలం విపక్షాలపై దాడి మాత్రమే కాకుండా ప్రజలకు జవా బుదారీగా ఉండాలని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం విఫలమవుతోందనే భావన ప్రజల్లో బలపడుతున్న నేపథ్యాన హామీల అమలుకు పూనుకోవాలని సూచించారు. ఆర్‌టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌, దాని మిత్రపక్షాల విజయం కోసం సీపీఐ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు మహ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement