రాజుపేట, ఆమెర్ద గ్రామసభల్లో తీర్మానం
యువత పెడదోవ పట్టకుండా నిర్ణయం
కూసుమంచి: గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పాటైన మద్యం బెల్ట్ షాపులతో పెద్దలే కాక యువత పెడదారి పడుతున్నారు. యువకులు మద్యానికి బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈక్రమాన ఉమ్మడి జిల్లాలోని కూసుమంచి మండలం రాజుపేట, అశ్వాపురం మండలం ఆమెర్ద గ్రామ సర్పంచ్‌ల నేతృత్వాన గ్రామస్తులంతా ఒక్కటై బెల్ట్ షాపులను మూసివేయించి మద్య నిషేధానికి నిర్ణయించారు. ఇందుకోసం గాంధీ జయంతిని రోజైన శుక్రవారం జరిగిన గ్రామసభల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రాజకీయాలకు పేరున్న రాజుపేట
కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి రాజకీయంగా పేరుంది. ఈ గ్రామస్తులైన కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఈ గ్రామం గతంలో అతి పెద్ద పంచాయతీగా ఉండగా.. కొత్త జీపీల ఏర్పాటు తర్వాత ప్రస్తుతం వేయికి పైగా జనాభా, 760 మంది ఓటర్లు ఉన్నారు. ఈక్రమాన గ్రామంలో వివిధ పార్టీల నాయకులు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఊరి బాగు కోసం ఏకమయ్యారు. గ్రామంలో మద్యపాన నిషేధం కోసం బెల్ట్ దుకాణాలను మూసివేయించాలనే నిర్ణయానికి అంతా మద్దతు తెలిపా రు. తొలుత కొందరు అభ్యంతరం చెప్పినా విద్యావంతుడైన సర్పంచ్ బానోతు మహేష్ నచ్చచెప్పడంతో పచ్చజెండా ఊపారు. ఈ క్రమాన శనివారం గ్రామంలోని బెల్ట్‌షాపుల నిర్వాహకులతో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. వారంలోగా దుకాణాలను పూర్తిగా మూసివేయాలని సూచిస్తూ నోటీసులు అందజేశారు. గడువు తర్వాత ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో త్వరలోనే రాజుపేటలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకానుంది.
ఉమ్మడి జిల్లాలోని రెండు గ్రామాల్లో మద్య నిషేధం


