12నుంచి మూడెకరాలకు..
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ‘సాగర్’లోకి చేరని నీరు
బోర్లు, బావుల కింద మాత్రం అతి తక్కువగా వరి సాగు
చివరకు ఎలా ఉంటుందోనని అన్నదాతల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓ వైపు ప్రభుత్వం వరి సాగు చేయొద్దని సూచిస్తోంది. ఇంకో పక్క తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో మాత్రం నీటి జాడ లేక జిల్లాలో వరి సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో అయోమయం నెలకొంది. శ్రీశైలం వరకు వచ్చిన నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీంతో సాగర్ నిండుతుందా.. దిగువకు విడుదల చేస్తారా, లేదా అని ఎదురుచూస్తున్నారు. జూలైలో జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు, సెప్టెంబర్‌లోనూ ఎల్‌నినో ప్రభావంతో అదే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో వరి సాధారణ సాగు లక్ష్యం 2.92 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 64,602 ఎకరాల్లోనే నాట్లు వేయగా, ఇది కూడా బోర్లు, బావుల కిందే సాగైంది.
రెండు నెలల్లో 30.2 శాతం లోటు
వానాకాలం సీజన్ మొదలయ్యాక జూన్, జూలై నెలల్లో 30.2 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది వరి పంట సాగుకు ఏ మాత్రం అనుకూలమైన సంకేతంలా లేదు. సాగుకు కీలకమైన జూలైలో అయితే 62 శాతం లోటు వర్షపాతం ఉండడం గమనార్హం. అత్యధికంగా ఎర్రుపాలెం, కూసుమంచి మండలాల్లో 60 – 99 శాతం మేర వర్షపాతం లోటు ఉంది. మిగతా 11 మండలాల్లో 20 – 59 శాతం లోటు ఉండగా, ఎనిమిది మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
కృష్ణమ్మ పరవళ్లు.. జిల్లాలో బీళ్లు
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. శ్రీశైలం వరకు వరద నీరు ఉప్పొంగుతున్నా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి మాత్రం నీళ్లు ఇంకా రావడం లేదు. వర్షాలు మరింత ఉధృతంగా కురిస్తే తప్ప సాగర్‌లోకి నీరు వచ్చే అవకాశం లేదు. అయినా ఆశ చంపుకోలేక కొందరు రైతులు బోర్లు, బావుల కింద వరి నాట్లు వేసి సాగర్ ఎప్పుడు నిండుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బోర్లు, బావుల సాయంతో నాట్లు వేసినా.. సాగర్ నీరు విడుదలైతేనే పంటలకు ప్రాణం రానుంది. ప్రధానంగా వరి సాగుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షాలే ఆధారం. ఈ రెండు నెలల్లోనూ ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవవని వాతావరణ శాఖ చెబుతుండడంతో పలువురు రైతులు ధైర్యం చేయలేక భూములను బీళ్లుగా పెట్టారు.
పక్క ఫొటోలో ఉన్న రైతు ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన బతినేని రామారావు. కొన్నేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, బోర్లలో నీరు పుష్కలంగా ఉండడంతో 12ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఈసారి వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీరు తగ్గింది. దీంతో 12 ఎకరాలకు బదులు మూడెకరాల్లో వరి సాగు చేపట్టాడు. మిగతా భూమి పత్తి వేశాడు. రెండు బోర్లు ఉన్నా ఇప్పుడే నీరు సరిపోవడం లేదని, వర్షాలు పడకపోతే పంటలు చేతికొస్తాయో, లేదోనని రామారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
వద్దంటున్న ప్రభుత్వం.. సందిగ్ధంలో రైతాంగం


