సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని హరి సంఘం రామాలయం పునఃనిర్మాణం కోసం టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈమేరకు నగదును సోమవారం ఆయన కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం విజయబాబు మాట్లాడుతూ దేవాలయాలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని.. వాటి అభివృద్ధి అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పునర్నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
విద్యుత్ ఇంజనీర్లకు
ఉద్యోగోన్నతి, బదిలీలు
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఇంజనీర్లు పలువురికి ఉద్యోగోన్నతి కల్పించడమే కాక నూతన స్థానాలకు బదిలీ చేస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో ఖమ్మం విద్యు త్ సర్కిల్ పరిధిలోని పలువురికి స్థానం దక్కింది. టెక్నికల్ డీఈ వి.చిన్న బాబూరావుకు సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ)గా ఉద్యోగోన్నతి కల్పించి వరంగల్ కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ కార్యాలయం–1లో నియమించారు. భద్రాద్రి జిల్లా హెచ్‌టీ విభాగం ఏడీఈ బి.కిరణ్‌కుమార్‌కు డీఈగా ఉద్యోగోన్నతి కల్పించి ఖమ్మం సర్కిల్ కార్యాలయం టెక్నికల్ డీఈగా నియమించారు. అలాగే, ఖమ్మం కన్‌స్ట్రక్షన్ విభాగం ఏడీఈ కిరణ్‌చక్రవర్తికి డీఈగా ఉద్యోగోన్నతి కల్పించి ఖమ్మం ఎంఆర్‌టీ విభాగానికి, ఎంఆర్‌టీ విభాగం డీఈ భద్రుపవార్‌ను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ డీఈగా, ఖమ్మం డీపీఈ విజిలెన్స్ విభాగం ఏడీఈ రామకృష్ణారావును ఖమ్మం కన్‌స్ట్రక్షన్ విభాగానికి బదిలీ చేశారు.
మిరప సాగు తగ్గిస్తేనే మేలు
రఘునాథపాలెం: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు మిరప సాగును నియంత్రించుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి ఎం.వీ.మధుసూదన్ సూచించారు. రఘునాథపాలెం రైతు వేదికలో నర్సరీ చట్టంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏడు నెలల కాలపరిమితి కలిగిన మిర్చి సాగుకు ప్రతీ దశలో సమృద్ధిగా నీటి అవసరం ఉంటుందని తెలిపారు. అంతేకాక పెట్టుబడి ఎక్కువ కానున్న నేపథ్యాన, వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు మిర్చి సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే, నర్సరీ యజమానులు రైతులకు నాణ్యమైన మొక్కలను మాత్రమే అందించాలని ఆదేశించారు. ఉద్యాన అధికారి జి.నగేష్ తదితరులు పాల్గొన్నారు.
‘అంతర్జాతీయ ఎక్స్‌పోజర్’కు
దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: ప్రతిభ కలిగిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లే అవకాశం కోసం ఈనెల 5వ తేదీన దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరుకావాలని డీఈఓ సదానందం సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు అంతర్జాతీయ ఎక్స్‌పోజర్, ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం మొదటి దశ పూర్తి కాగా... రెండో దశకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నాటికి 55ఏళ్ల లోపు వయస్సు వారు, కనీసం పదేళ్ల సర్వీస్‌తో పాటు పని చేస్తున్న పాఠశాలలో కనీసం వంద మంది విద్యార్థుల నమోదై ఉంటే అర్హులని చెప్పారు. ఎలాంటి చార్జ్‌షీట్, విచారణ, నేరారోపణ కేసు, ఆరోపణలు పెండింగ్‌లో ఉండకూడదని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు. కేటగిరీల వారీగా ఆరుగురిని ఎంపిక చేయనుండగా, ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలకు అవకాశం దక్కుతుందని తెలిపారు. గత మూడేళ్ల పనితీరు ఆధారంగా దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు ఈనెల 5వ తేదీన ఉదయం 10గంటలకు డీఈఓ కార్యాలయంలో మొదలవుతాయని వివరించారు. ఇక్కడి నుంచి జాబితాను కలెక్టర్ నిర్ణయంతో పంపిస్తే రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ పేర్లు ఖరారు చేస్తుండని డీఈఓ తెలిపారు.


