ఆపరేటర్లు ఔట్‌? | - | Sakshi
Sakshi News home page

ఆపరేటర్లు ఔట్‌?

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

● భూభారతి ఆపరేటర్ల కుదింపునకు నిర్ణయం ● జిల్లాలో 12మందినే కొనసాగించాలని ఉత్తర్వులు

● భూభారతి ఆపరేటర్ల కుదింపునకు నిర్ణయం ● జిల్లాలో 12మందినే కొనసాగించాలని ఉత్తర్వులు

ఖమ్మం సహకారనగర్‌: ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న భూభారతి ఆపరేటర్ల(ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌) తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలో ఒకరితో పాటు మండలానికి ఒకరు చొప్పున ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అయితే, లావాదేవీలు తక్కువగా ఉన్న తహసీల్దార్ల కార్యాలయాల్లోని వారిని తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 21 మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఒక్కో ఆపరేటర్‌ ఉండగా... కలెక్టరేట్‌లో ఒకరు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంటారు. మొత్తంగా 22మందికి గాను 12మందినే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఏళ్లుగా పనిచేస్తున్న తమను యథావిధిగా కొసాగించాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

2018 నుంచి విధుల్లో

రెవెన్యూ శాఖలో 2018వ ఆపరేటర్లను నియమించారు. ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో ధరణిని ప్రవేశపెట్టగా... నాటి నుంచి ధరణి ఆపరేటర్లుగా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక భూభారతిగా మార్చాక కూడా వారే కొనసాగుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్యకలాపాలు, భూమి ధరల నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సుమారు 17నెలల వేతనం పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు తొలగించాలన్న ఆదేశాలతో ఆందోళన వ్యక్తమవుతోంది.

రిజిస్ట్రేషన్లు లేవని...

జిల్లాలో 21 మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ఈక్రమాన అతి తక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తొమ్మిది మండలాల్లోని ఆపరేటర్లను తొలగించాలని, ఈక్రమాన పనితీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఫలితంగా జిల్లా కేంద్రంలోని కోఆర్డినేటర్‌ కాక, మిగతా 21మందిలో 12మందినే కొనసాగించాల్సి ఉంటుంది. వీరి విధులను ఇటీవల చేరిన జూనియర్‌ అసిస్టెంట్లకు అప్పగించే అవకాశముందని సమాచారం. కాగా, ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను తొలగించకుండా అందరినీ కొనసాగించాలని ఆపరేటర్లు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement