● రైల్వేట్రాక్, జల రవాణాపై కేంద్రానికి ప్రతిపాదనలు ● త్వరలోనే కొత్తగూడెంకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందం ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారితో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు దక్షిణాది– ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా సోమవారం ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్‌పూర్ – అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని, ఇవి పూర్తయితే ఖమ్మం నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని పేర్కొన్నారు. నూతనంగా భద్రాచలం – ఏటూరునాగారం జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. అలాగే, విజయవాడ – జగదల్‌పూర్, ఖమ్మం – అశ్వారావుపేట, జగ్గయ్యపేట – కొత్తగూడెం మార్గాలను నాలుగు లేన్లు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం త్వరలోనే పరిశీలనకు వస్తుందని తెలిపారు. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని మల్కన్‌గిరి రైల్వేలైన్‌తో అనుసంధానించే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అయితే, గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి ఐదేళ్ల సమయం పట్టనున్నందున, అప్పటివరకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు 16 కి.మీ. ట్రాక్ పనులను త్వరగా పూర్తి చేసి రైలు మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. అంతేకాక బ్రిటీష్ కాలంలో గోదావరి నది ద్వారా జరిగిన సరుకు, కలప, ఖనిజాల రవాణాను పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీల నిర్మాణంతో గోదావరిలో నిరంతరం నీటి లభ్యత ఉంటుందని, తద్వారా జలరవాణాకు అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి, తుపాకుల ఎలగొండ స్వామి, మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


