జూన్ వర్షాలతో లక్ష్యాన్ని దాటిన విస్తీర్ణం జూలైలో కురిసిన జల్లులతో ఆశాజనకంగా పంటలు
జిల్లాలో మెట్ట పంటలుగా సాగు చేసే పత్తి, పెసర విస్తీర్ణం అంచనాలను మించింది. ప్రస్తుత వానాకాలం జిల్లాలో అన్ని పంటలు కలిపి 5,53,329 ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,92,915 ఎకరాల్లో వరి పోగా, మిగిలిన విస్తీర్ణంలో పత్తి, పెసర, మినుము, కంది, వేరుశనగ, చెరకు వంటి పంటలను సాగు చేస్తారని ప్రణాళికలో పొందుపరిచారు. అయితే, ఈ ఏడాది జూన్‌లో కురిసిన వానలు పత్తి, పెసర సాగుకు అనుకూలించడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపారు. ఆతర్వాత జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అడపాదడపా కురుస్తున్న జల్లులు ఈ పంటలకుప్రయోజనం కలిగిస్తున్నాయి. –ఖమ్మంవ్యవసాయం
15 వేల ఎకరాలు అదనం
జిల్లాలో వరి తర్వాత రెండో ప్రధాన పంటగా పత్తి సాగవుతుంది. ఈ సీజన్‌లో పత్తి 2,16,229 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, తొలకరి వర్షాలకే దుక్కులు చేసిన రైతులు అంచనాలకు మించి 2,31,577 ఎకరాల్లో విత్తనాలు నాటారు. ఎక్కువ మంది అధిక సాంద్రత, బోదెల పద్ధతి అవలంబిస్తుండగా.. రఘునాథపాలెం మండలంలో పత్తి అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అంతేకాక చింతకాని, తిరుమలాయపాలెం, బోనకల్, కారేపల్లి, కొణిజర్ల, ముదిగొండ, ఏన్కూరు, మధిర, కామేపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో కూడా సాగు విస్తీర్ణం అధికంగానే ఉంది
పెసరకు ప్రాధాన్యం
సాధారణంగా జిల్లాలో మెట్ట పంటగా పెసర సాగు చేస్తారు. మిరప సాగు చేసే భూముల్లో తొలుత పెసర వేసి కోత తర్వాత మిర్చి సాగు మొదలుపెడతారు. ఈ పద్ధతిని కొందరు రైతులు అనుసరిస్తుండగా, ఇంకొకొందరు రైతులు వర్షాభావ పరిస్థితుల్లో వరి మాగాణుల్లోనూ పెసర వేశారు. వర్షాలు కురిస్తే పైరును పచ్చిరొట్టగా దున్ని వరి నాట్లు వేయాలని భావించారు. లేని పక్షంలో పెసర పంట పండుతుంది. ఈ ఏడాది పెసర సాధారణ సాగు విస్తీర్ణం అంచనా 15,607 ఎకరాలైతే 22,711 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పెసర పూత, పిందె దశకు చేరగా.. మరో 20 – 30 రోజుల్లో పంట చేతికందనుంది.
అంచనాలకు మించి పత్తి, పెసర సాగు


