పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
నోటిఫికేషన్ రావడంతో
తీవ్రంగా కసరత్తు
ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యేలా మైదానాల్లో శిక్షణ
శ్వాస సంబంధిత వ్యాయామమే కీలకం
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేసన్ ఆధారంగా ఉమ్మడి జిల్లాకు సివిల్, ఏఆర్, అగ్నిమాపక శాఖల్లో కలిపి 621 కానిస్టేబుల్ పోస్టులు కేటాయించారు. జైళ్ల శాఖ, స్పెషల్ పార్టీ, బెటాలియన్లలోనూ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కసరత్తు మొదలుపెట్టారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికలో ఫిజికల్ టెస్ట్ కీలకం కావడంతో మైదానాలకు బారులుదీరుతున్నారు. క్రీడల్లో ప్రవేశం ఉన్నవారు సొంతంగానే ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆ అనుభవం లేని వారు కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. అంతేకాక రాతపరీక్షలోనూ సత్తా చాటేలా కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలు పొందుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
పోలీసు శాఖ ఉద్యోగ పరీక్షల్లో లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, 100, 800 మీటర్ల పరుగులో అత్యధిక మార్కులు సాధించిన వారే క్వాలిఫై అవుతారు. అయితే, రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్‌పై అవగాహన లేకపోతే ఫలితం తారుమారయ్యే ప్రమాదముంది. అందుకే ఆశావహులు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. అయితే, అభ్యర్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని.. జాగింగ్ లేదా రన్నింగ్, వ్యాయామం వంటివి ముమ్మరంగా సాధన చేస్తేనే ఈవెంట్లలో ఉత్తీర్ణత సాధించే అవకాశమున్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏడాదిగా నోటిఫికేషన్ కోసం చూస్తున్నా. ప్రస్తుతం నోటిఫికేషన్ రావడంతో పోలీసు ఉద్యోగం సాధించి అమ్మనాన్న ఆశలు నెరవేర్చేలా శిక్షణ తీసుకుంటున్నా. ఫిజికల్ టెస్ట్‌లతో పాటు రాత పరీక్షల్లోనూ అర్హత సాధించేలా కసరత్తు మొదలుపెట్టా.
– రాజేష్, అభ్యర్థి, ఖమ్మం
ప్రతీ అభ్యర్థి పరీక్షలో అర్హత సాధించేలా మెళకువలు నేర్పుతున్నాం. తగినన్ని మార్కులు సాధించేలా స్కిల్స్ పెంపొందిస్తున్నాం. పరిమిత సంఖ్యలో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ అన్ని ఈవెంట్లలో ప్రాక్టీస్ చేయిస్తున్నాం.
– కె.తిరుపతి, కోచ్, ఖమ్మం
అభ్యర్థులు శ్యాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. తద్వారా పరుగు పందెం, ఇతర విభాగాల్లో మెరుగైన ఫలితం వస్తుంది. లేకపోతే ప్రమాదాలు ఎదురవుతాయి. ప్రమాదం కొనితెచ్చుకోకుండా ప్రణాళికాయుతంగా ప్రాక్టీస్ చేయాలి.
– డాక్టర్ వి.గంగరాజు, ఫిజీషియన్, ఖమ్మం


